- సన్న వడ్లకు రూ.1,186 కోట్ల బోనస్
- ముగిసిన వానాకాలం కొనుగోళ్లు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర సివిల్ సప్లయ్స్ శాఖ ఈ వానాకాలంలో 53.32 లక్షల టన్నుల వడ్లు సేకరించింది. ఇందుకు సంబంధించి రైతులకు రూ.12,022 కోట్ల చెల్లింపులు చేసింది. ఈసారి వానాకాలంలో 70 లక్షల టన్నుల వడ్లు కొనాలనే అంచనాతో పౌర సరఫరాల శాఖ 8 వేల సెంటర్లు ఓపెన్ చేసింది. సన్నవడ్లకు అదనంగా రూ.500 బోనస్ ఇస్తామని సర్కారు ప్రకటించడం, దీనికి తోడు ఈయేడు దేశవ్యాప్తంగా ధాన్యం ఉత్పత్తి కొరత నేపథ్యంలో బహిరంగ మార్కెట్లో సన్న వడ్లకు డిమాండ్ పెరిగింది. దీంతో ప్రైవేటు వ్యాపారులు పోటీ పడి మంచి ధరకు సన్న వడ్లు కొనుగోలు చేశారు.
అయినప్పటికీ సర్కారు కొనుగోలు సెంటర్లకు ధాన్యం పోటెత్తింది. వానాకాలం ధాన్యం కొనుగోళ్లను వేగంగా పూర్తి చేసిన ప్రభుత్వం.. అంతే వేగంతో రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేసింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మిన రైతులకు రెండు మూడు రోజుల్లోనే చెల్లింపులు పూర్తిచేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 10.19 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.12,022 కోట్లు జమ చేసింది. సర్కారు స్పష్టమైన ఆదేశాల నేపథ్యంలో సివిల్ సప్లయ్స్ విభాగం ధాన్యం అమ్మిన రైతులందరికీ రెండు మూడు రోజుల్లోనే డబ్బులు చెల్లించింది. ఈ సారి రెండు మూడు వారాల ముందే కొనుగోళ్లు షురూ చేయడంతో పాటు టైమ్‌కు డబ్బులు అందించింది.
సన్న వడ్లు 23.73 లక్షల టన్నులు ..
రాష్ట్ర ప్రభుత్వం వానాకాలం సీజన్లో సన్నవడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ప్రకటించింది. సర్కారు ప్రోత్సాహంతో ఈయేడు వానాకాలంలో అత్యధికంగా రికార్డు స్థాయిలో 67.78 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగింది. అందులో 61శాతానికి పైగా సన్నవడ్లు సాగు చేశారు. ప్రైవేటు వ్యాపారులు, రైతుల సొంత అవసరాలకు పోగా మిగిలిన 23.73 లక్షల టన్నుల వడ్లను సివిల్ సప్లయ్స్ ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు సెంటర్లకు రైతులు తీసుకువచ్చారు. ఆ వడ్లకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1,186.50 కోట్ల బోనస్చెల్లించింది. సన్నవడ్లు పోను మిగిలిన 29.59 లక్షల టన్నుల దొడ్డువడ్లను సైతం రాష్ట్ర సర్కారు రైతుల నుంచి కొనుగోలు చేసింది.
సీఎంఆర్ డిఫాల్టర్ మిల్లులకు చెక్
గతంలో ధాన్యం కస్టమ్ మిల్లింగ్ చేసి బియ్యం తిరిగి ఇవ్వకుండా బకాయి పడ్డ మిల్లర్లకు ఈసారి ధాన్యం కేటాయించలేదు. నూటికి నూరు శాతం కస్టమ్ మిల్లింగ్ రైస్ అప్పగించడంతో పాటు బ్యాంక్ గ్యారంటీ ఇచ్చిన మిల్లర్లకు మాత్రమే ధాన్యం కేటాయించింది. రాష్ట్రంలో 1,532 మంది మిల్లర్లు ధాన్యం ఇవ్వకుండా ఎగవేసిన జాబితాలో ఉన్నారు. వాటిలో 362 మంది రైస్ మిల్లర్లు డిఫాల్టర్లుగా మారగా.. వారిలో ఫైన్లు, రికవరీ బ్యాంక్ గ్యారంటీ ఇచ్చిన వారికే కేటాయింపులు చేశారు.